అప్పుడే పుట్టిన శిశువును చూసిన ఆస్పత్రి సిబ్బంది, శిశువు కుటుంబ సభ్యులతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. కారణం.. ఆ శిశువు రెండు తలలు, మూడు చేతులతో జన్మించడమే. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జావ్రా గ్రామంలో సోహైల్ ఖాన్, షాహీన్ దంపతులు నివసిస్తున్నారు. షాహీన్ కు పురుటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను రత్తాం జిల్లా ఆస్పత్రికి మంగళవారం తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ప్రసవం అనంతరం బిడ్డను చూసిన వైద్యులు షాక్‌కు గురైయ్యారు. శిశువుకు రెండు తలలు ఉండటమే గాక.. మూడు చేతులు ఉన్నాయి. రెండు చేతులు సాధారణంగానే ఉండగా.. మూడో చెయ్యి తలల మధ్య ఉంది. శిశువును వెంటనే మహారాజా యశ్వంతరావు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
దీనిపై పీడియాట్రిక్ సర్జన్ డా.బ్రిజేశ్ లహోటీ మాట్లాడుతూ.. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో పాలీసెఫాలి కండీషన్ అంటారన్నారు. నిజానికి డెలివరీ సమయంలో తీసిన సోనోగ్రఫీలో కడుపులో కవలలు ఉన్నట్లు తెలిసిందని, అయితే.. పిల్లల పరిస్థితి తెలియదన్నారు. శిశువు పెరిగే తొలి రోజుల నుంచి వీరిపై అబ్జర్వేషన్ ఉంచాలని.. ఇప్పటివరకూ శిశువుపై ఎటువంటి సర్జరీ ప్లాన్ చేయలేదన్నారు. ఆ శిశువుకు రెండు గుండెలు ఉన్నట్లు గుర్తించామన్నారు.