ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దళిత మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాజ్ వాది పార్టీకి చెందిన ఫైజాబాద్ ఎంపీ అవధేష్ ప్రసాద్ మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల కనిపించకుండా పోయిన అయోధ్యకు చెందిన యువతి మృతదేహం అత్యంత దారుణ స్థితిలో దొరకడంతో స్థానిక ఎంపీ ఆవేదనకు లోనయ్యారు. యువతి కనిపించకుండా పోయి రెండు మూడు రోజులు అవుతున్నా ఆమె కాపాడలేకపోయానని.. చివరికి దారుణంగా హత్యాచారానికి గురయినట్లు పేర్కొంటూ మీడియా ముందు విలపించారు. ఈ విషయంపై ప్రధాని మోడీతోఎ మాట్లాడతానని.. యువతి ప్రాణాలు కాపాడలేకపోయినందు తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. దీంతో పార్టీ నేతలు ఆయనను సముదాయించారు.
రేప్‌నకు గురైన యువతి కాళ్లు విరిచి, కంటి గుడ్లు పెకలించిన 22 ఏళ్ల మహిళ నగ్న మృతదేహాన్ని కాలువలో శనివారం గుర్తించారు. అయోధ్య జిల్లాకు చెందిన 22 ఏళ్ల దళిత మహిళ జనవరి 30న రాత్రి వేళ భజన కార్యక్రమానికి వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. కాళ్లు విరిచి, కంటి గుడ్లు పీకి, తాళ్లతో కట్టేసిన నగ్న మృతదేహాన్ని శనివారం కాలువలో గుర్తించినట్లు తెలిపారు. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో అన్నది నిర్ధారిస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.