బిహార్ రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. మొత్తం 17 మంది పిడుగుపాటుకు బలయ్యారు. భాగల్పూర్ జిల్లాలో ఆరుగురు, వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా జిల్లాలో ఇద్దరు, ఖగారియా జిల్లాలో ఇద్దరు, ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. శనివారం రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురియడంతో ఇంత మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఆయా ఘటనలపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతికూల వాతావరణంలో ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, పిడుగులు పడకుండా విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన సూచనలను పాటించాలని కోరారు.
ఇక.. గుజరాత్, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌తో పాటు బిహార్‌లో నైరుతి రుతుపవనాలు ముందుకు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య, తూర్పు భారతం అంతటా రెండు మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.