మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న పోలింగ్
మిజోరంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
By అంజి Published on 7 Nov 2023 2:50 AM GMTమిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న పోలింగ్
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి ఘట్టం నేటితో మొదలైంది. మిజోరంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మిజోరంలో 40 సీట్లు ఉండగా.. మొదటి దశలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో 20 సీట్లల్లో పోలింగ్ జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో.. 40 సీట్ల కోసం 174మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మిజోరంలో మొత్తం 8,53,088 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4,13,064 మంది పురుషులు, 4,39,028 మంది మహిళలు ఉన్నారు. వీరిలో మొదటిసారి ఓటు వేస్తున్న వారి (18-19ఏళ్లు) సంఖ్య 50,611గా ఉంది. 80ఏళ్లు పైబడిన వారు 8,490మంది ఉన్నారు. 1276 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మిజోరంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 సీట్లు అవసరం. 2018లో జరిగిన ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రెంట్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 26 సీట్లల్లో గెలుపొందింది. కాంగ్రెస్‌కు ఐదు సీట్లు, బీజేపీకి ఒక సీటు వచ్చింది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉంది. ఇక్కడ మొత్తం 90 సీట్లు ఉన్నాయి. వీటికి రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఇవాళ 20 సీట్లు పోలింగ్‌కు వెళ్లనుండగా.. కోంటా నియోజకవర్గంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మిగిలిన నియోజకవర్గాలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ నియోజకవర్గాల్లో మావోయిస్టుల ప్రభావం అధికం. అందుకే ఎలక్షన్ కమిషన్ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. మిగిలిన 70 సీట్లకు ఈ నెల 17 ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి దశలో 20 సీట్ల కోసం జరుగుతున్న పోలింగ్‌లో 223 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 198 మంది పురుషులు, 25మంది మహిళలు ఉన్నారు.