తమ రాష్ట్రంలో ముస్లిం జనాభా ప్రతి పదేళ్లకు 30 శాతం పెరుగుతోందని, 2041 నాటికి వారే మెజారిటీ అవుతారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శుక్రవారం పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. “గణాంకాల నమూనా” ప్రకారం ఇప్పుడు అస్సాం జనాభాలో ముస్లింలు 40 శాతంగా మారారని అన్నారు. “2041 నాటికి అస్సాం ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుంది. ఇది వాస్తవం, ఎవరూ దానిని ఆపలేరు” అని సీఎం హిమంత చెప్పారు.
ప్రతి పదేళ్లకు హిందూ జనాభా 16 శాతం పెరుగుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ముస్లిం సమాజంలో జనాభా పెరుగుదలను తగ్గించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని శర్మ చెప్పారు. "ముస్లింల జనాభా పెరుగుదలను అరికట్టడంలో కాంగ్రెస్‌కు అత్యంత ముఖ్యమైన పాత్ర ఉంది... రాహుల్ గాంధీ జనాభా నియంత్రణకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారితే, ముస్లిం సమాజం అతని మాటలను మాత్రమే వింటుంది కాబట్టి అది అదుపులో ఉంటుంది" అని ఆయన అన్నారు.