కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: అశోక్‌ గెహ్లాట్‌

Ashok Gehlot says won't fight Congress presidential election. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై తన నిర్ణయంపై గురువారం మౌనం వీడారు.

By అంజి  Published on  29 Sep 2022 12:46 PM GMT
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: అశోక్‌ గెహ్లాట్‌

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై తన నిర్ణయంపై గురువారం మౌనం వీడారు. తాను పోటీ చేయడం లేదని చెప్పారు. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో కలిసిన తర్వాత ఇది జరిగింది. ''నేను కొచ్చిలో రాహుల్ గాంధీని కలిశాను. కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని రాహుల్‌ను కోరాను. అతను అంగీకరించకపోవడంతో.. నేను పోటీ చేస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు రాజస్థాన్‌లో సంఘటనతో నేను ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను'' అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు.

రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అశోక్‌ గ్లెహాట్‌ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవడంతో.. పార్టీ అత్యున్నత పదవికి తిరువనంతపురం ఎంపీ శశి థరూర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ పోటీలో ఉన్నారు.

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం ఏమిటి?

రాజస్థాన్‌లో ఆదివారం రాత్రి 82 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి పంపడంతో రాజకీయ సంక్షోభం రాజుకుంది. ఆ తర్వాత గెహ్లాట్ సోనియా గాంధీని కలవడానికి ఢిల్లీకి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో గెహ్లాట్ గెలిస్తే.. తదుపరి ముఖ్యమంత్రిగా సచిన్ పైలట్‌ను స్వీకరించడానికి రాజస్థాన్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఇది కాంగ్రెస్ నాయకత్వం, గెహ్లాట్ విధేయుల మధ్య ప్రతిష్టంభనకు దారితీసింది. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్, పరిశీలకులు మల్లికార్జున్ ఖర్గే, అజయ్ మాకెన్ నుండి నివేదికను కోరింది.

కాంగ్రెస్ అగ్ర నాయకత్వం గెహ్లాట్‌తో విసిగిపోయిందని, ఆదివారం నాటి సంఘటనల తర్వాత ఆయనను రేసు నుంచి తప్పించాలని ఊహాగానాలు వచ్చాయి. అయితే రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి గెహ్లాట్ బాధ్యులేనని పరిశీలకులు సోనియా గాంధీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

Next Story