ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగిన నేపథ్యంలో కేంద్రం ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. అసదుద్దీన్ ఒవైసీ భద్రతను కేంద్ర హోంశాఖ సమీక్షించింది. ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించేందుకు నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. జెడ్ కేటగిరీలో 22 మంది రక్షణ సిబ్బంది ఉంటారు. ఇందులో నాలుగు నుంచి ఆరుగురు ఎన్ఎస్జీ కమాండోలు, మిగిలిన వారు పోలీసు సిబ్బంది ఉంటారు. ఒవైసీ పార్లమెంటులో మాట్లాడుతూ.. తనకు చావంటే భయంలేదని, తనకు జెడ్ కేటగిరీ భద్రత అవసరంలేదని అన్నారు.
దయచేసి తనకు న్యాయం చేయాలని, తనపై కాల్పులు జరిపిన దుండగులను యూఏఈపీ చట్టం కింద బోనులో నిలపాలని కోరారు. విద్వేషానికి, విద్రోహకరశక్తులకు ముగింపు పలకాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానంటూ ఒవైసీ లోక్ సభలో వ్యాఖ్యలు చేశారు. "ఎవరు వీళ్లు? వీళ్లకు బ్యాలెట్లపై నమ్మకంలేక బుల్లెట్లనే నమ్ముకున్నారా? ఇలాంటి విద్రోహకర శక్తుల ఆటకట్టించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి" అంటూ విజ్ఞప్తి చేశారు. "నన్ను 'ఏ క్లాస్' పౌరుడిగా మార్చే ఈ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ నాకొద్దు. సామాన్యుడిగా నాకు ప్రజల్లో ఉండడమే ఇష్టం" అని స్పష్టం చేశారు.