కోర్టు తీర్పు నిరాశపరిచింది.. మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!

మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ NIA కోర్టు తీర్పు ఇచ్చింది.

By Medi Samrat
Published on : 31 July 2025 2:43 PM IST

కోర్టు తీర్పు నిరాశపరిచింది.. మాలేగావ్ పేలుళ్ల కేసు తీర్పుపై ఒవైసీ స్పందన ఇదే..!

మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ NIA కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కోర్టు తీర్పు నిరాశ కలిగించిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ముంబై రైలు పేలుళ్ల కేసులో చేసినట్లుగా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం స్టే కోరతాయో లేదో చూడాలని అన్నారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో మాలేగావ్ పేలుడు కేసులో నిందితులను నిర్దోషులుగా విడుదల చేయడానికి నాసిరకంగా సాగిన దర్యాప్తు కారణమని అభిప్రాయపడ్డారు. “మాలేగావ్ పేలుడు కేసు తీర్పు నిరాశపరిచింది. పేలుడులో ఆరుగురు మరణించారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. వారి మతం కోసం వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా సాగిన నాసిరకం దర్యాప్తు/ప్రాసిక్యూషన్ నిర్దోషులు విడుదలకు కారణమైంది” అని ఒవైసీ అన్నారు.

మాలేగావ్‌లో బాంబు పేలుళ్ల ఘటన కేసులో ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు పదిహేడెళ్ల తర్వాత తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను నిర్దోషులుగా తేల్చింది. మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ సహా మిగిలిన నిందితులు నేరం చేశారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది. మాలేగావ్‌లో బైకులోనే బాంబు పెట్టినట్లు ఎన్​ఐఏ నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. మాజీ సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు సొంత బైకు ఉన్నట్లు ఆధారాల్లేవని న్యాయస్థానం పేర్కొంది. మరో నిందితుడు కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఇంట్లో ఆర్డీఎక్స్ ఉన్నట్లు ఆధారాల్లేవని వివరించింది. ఘటనా స్థలం నుంచి వేలిముద్రలు, డీఎన్​ఏ నమూనాలను సేకరించలేదని తెలిపింది. నిందితుల మధ్య సమావేశాలు జరిగినట్లు, కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయిందని పేర్కొంది.

Next Story