'కేసీఆర్‌ ప్రధాని రేసులో ఉన్నారా?'.. ఓవైసీ సమాధానం ఇదే

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించారు.

By అంజి  Published on  20 March 2023 10:15 AM IST
Asaduddin Owaisi , KCR , Bihar

'కేసీఆర్‌ ప్రధాని రేసులో ఉన్నారా?'.. ఓవైసీ సమాధానం ఇదే

ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తన సొంత రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్‌ రాష్ట్రంలోని వరదలకు గురయ్యే ప్రాంతమైన “సీమాంచల్” పర్యటనను ముగించే ముందు హైదరాబాద్ ఎంపీ కిషన్‌గంజ్ జిల్లాలో జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేసీఆర్‌ ప్రధాని రేసులో ఉన్నారా? అని విలేఖరులు అడిగారు. ఇందుకు ఓవైసీ స్పందిస్తూ.. ''కేసీఆర్‌కు విజన్ ఉందని చెప్పాలి. అతను తన పదవీకాలంలో విలువైనదే చేశాడు'' అని అన్నారు. అయితే కేసీఆర్‌ ప్రధాని రేసులో ఉన్నారా? లేదా? అనే విషయంపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు. ఇదే సమయంలో.. బీహార్, పశ్చిమ బెంగాల్‌లో కేసీఆర్‌ సహచరులైన నితీశ్‌ కుమార్‌, మమతా బెనర్జీలను కూడా ఒవైసీ ప్రశంసించారు.

రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్‌ ఎంతో చేశారని, తెలంగాణకు సముద్రం తీర లేకపోయినా మెరుగైన (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి) జీఎస్‌డీపీతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని అన్నారు. పంపుసెట్ల వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. మత్స్యసంపద విషయంలో రెండో అతిపెద్ద ఉత్పతిదారుగా ఉన్నదని పేర్కొన్నారు.

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఐదు సీట్లు గెలుచుకుంది. దాని నలుగురు ఎమ్మెల్యేలు గత సంవత్సరం ఆర్జేడీలో చేరారు. వారిలో ఒకరు క్యాబినెట్ బెర్త్ కూడా పొందారు. ''2020లో మహాఘట్‌బంధన్‌తో పొత్తు పెట్టుకోవాలని మేము కోరుకున్నాము, కానీ వారు మమ్మల్ని ఎగతాళి చేశారు. మా పనితీరు అందరూ చూసేలా ఉంది'' అని ఒవైసీ అన్నారు. కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేశాం. 2025లో 243 మంది బీహార్ అసెంబ్లీలో 50 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెడతామని అన్నారు.

Next Story