'ముస్లిం మహిళలను బీజేపీ టార్గెట్ చేస్తోంది'.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ ప్రక్రియలో బిజెపి వారికి అడ్డంకిని సృష్టిస్తోందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
By అంజి Published on 24 May 2024 8:30 AM GMT'ముస్లిం మహిళలను బీజేపీ టార్గెట్ చేస్తోంది'.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ యూనిట్ బురఖాలు ధరించిన మహిళా ఓటర్లను “సరైన ధృవీకరణ” చేయాలని డిమాండ్ చేయడంతో, ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని ఓటింగ్ ప్రక్రియలో బిజెపి వారికి అడ్డంకిని సృష్టిస్తోందని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ గురువారం అన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ''బురఖా ధరించిన మహిళలను ప్రత్యేకంగా తనిఖీ చేయాలని బిజెపి ఢిల్లీ యూనిట్ ఎన్నికల కమిషన్‌కు తెలిపింది. తెలంగాణలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ అభ్యర్థి ముస్లిం మహిళలను బహిరంగంగా అవమానించి వేధించారు. ప్రతి ఎన్నికలలో, ముస్లిం మహిళలను వేధించడానికి, లక్ష్యంగా చేసుకోవడానికి బిజెపి ఏదో ఒక సాకును కనుగొంటోంది'' అని అన్నారు.
''బురఖాలో ఉన్నా, పరదాలో ఉన్నా, మాస్క్‌లో ఉన్నా, పర్దా పాటించని మహిళలకు ఎన్నికల సంఘం స్పష్టమైన నియమ నిబంధనలను కలిగి ఉంది, ధృవీకరణ లేకుండా ఎవరికీ ఓటు వేయడానికి అనుమతి లేదు, కాబట్టి బిజెపి ఎందుకు ఇంత ప్రత్యేక డిమాండ్ చేయాల్సి వచ్చింది? కేవలం ముస్లిం మహిళలను టార్గెట్ చేసి, వారిని వేధించి, ఓటు వేయకుండా అడ్డంకులు సృష్టించడానికేనా?'' అని అసదుద్దీన్ ప్రశ్నించారు.
అంతకుముందు, ఢిల్లీ బీజేపీ ప్రతినిధి బృందం బుధవారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO)ని కలిసి, మే 25 పోలింగ్ సందర్భంగా మహిళా అధికారుల సహాయంతో 'బురఖా' లేదా ఫేస్ మాస్క్‌లు ధరించిన మహిళా ఓటర్లను సరిగ్గా ధృవీకరించాలని డిమాండ్ చేసింది.
మరోవైపు, హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్ బూత్‌కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల ఓటర్ ఐడీ కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ఆమెపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 171సీ, 186, 505(1)(c), ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో మే 25న మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. ఇందులో ఆప్, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా బ్లాక్, భారతీయ జనతా పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుంది. దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికలలో పోరాడుతున్నాయి. ఆప్ నాలుగు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
ఢిల్లీలోని ఏడు పార్లమెంటరీ నియోజకవర్గాలు చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ.