అరవింద్ పనగఢియాకు కీలక బాధ్యతలు

నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగఢియా 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా నియమితులయ్యారు.

By Medi Samrat
Published on : 31 Dec 2023 8:45 PM IST

అరవింద్ పనగఢియాకు కీలక బాధ్యతలు

నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగఢియా 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. రిత్విక్ రంజనం పాండే కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పనగఢియా ఫైనాన్స్ కమిషన్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఈ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది.

ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ రిత్విక్ రంజనం పాండే ఈ ఆర్థిక సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తారని.. 16వ ఆర్థిక సంఘం సభ్యుల వివరాలను ప్రత్యేకంగా నోటిఫై చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్, ఇతర సభ్యులు బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి తుది నివేదిక సమర్పించే తేదీ వరకు లేదా 2025 అక్టోబర్ 31 వరకు ఆ పదవిలో ఉంటారు. ఈ సంఘం ఐదేళ్ల కాలానికి (2026-27 నుంటి 2030-31 వరకు) సంబంధించిన సిఫారసుల నివేదికను 2025 అక్టోబర్​లో రాష్ట్రపతికి అందిస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నవంబర్​లో సమావేశమైన కేంద్ర క్యాబినెట్ 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన విధివిధానాలకు ఆమోదం తెలిపింది.

Next Story