మ‌రోసారి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ క్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు సెప్టెంబర్ 3 వరకు పొడిగించింది

By Medi Samrat  Published on  27 Aug 2024 1:13 PM GMT
మ‌రోసారి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ క్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు సెప్టెంబర్ 3 వరకు పొడిగించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఢిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) న‌మోదు చేసిన‌ కేసులో కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది.

మార్చి 21న ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. జూన్ 20న ఆయనకు ఈడీ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌ను జూన్ 21న ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా జూన్ 22న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత జూన్ 26న ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అనంతరం ఈడీ మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు జూలై 11న బెయిల్ మంజూరు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోరుతూ.. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు సెప్టెంబర్ 5న విచారణ చేపట్టనుంది.

ఇక ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆమెకు తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. కవిత, ఈడీ తరఫున వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

Next Story