టీఆర్ఫీ స్కామ్ లో అర్నబ్ గోస్వామి అడ్డంగా దొరికిపోయారా..

Arnab Goswami TRP Scam. టీఆర్పీ కోసం ఏమైనా చేసే వ్యక్తులు కొందరు ఉన్నారని.. వారి కోవలోకే ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి.

By Medi Samrat  Published on  26 Jan 2021 3:15 AM GMT
Arnab Goswami TRP Scam
టీఆర్పీ కోసం ఏమైనా చేసే వ్యక్తులు కొందరు ఉన్నారని.. వారి కోవలోకే ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ గోస్వామి చేరుతారని పలువురు గతంలో ఆరోపించారు. కానీ కొందరు మాత్రం ఆయన్ను వెనకేసుకొని వచ్చారు. కానీ కొద్దిరోజుల కిందట వాట్సాప్ చాట్ బహిర్గతం అవ్వడంతో అర్ణబ్ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటూ ఉంది. టీఆర్పీ కుంభకోణం కేసులో ఇటీవల లీకైన అర్నబ్ గోస్వామి, మాజీ బార్క్ సీఈవో పార్థో దాస్ గుప్తాల వాట్సాప్ చాట్‌ పెను దుమారం రేపుతోంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన బాలాకోట్ స్ట్రైక్స్‌ గురించి అర్నబ్‌కు ముందే సమాచారం ఉన్నట్లుగా ఆ సంభాషణల్లో వెల్లడైంది. ఇది అధికారిక రహస్యాల చట్టానికి తూట్లు పొడవడమేనని అంటున్నారు. కేబినెట్ మంత్రులకు కూడా తెలియనివ్వకుండా అత్యంత సీక్రెట్‌గా రక్షణ శాఖ చేపట్టే ఆపరేషన్స్ గురించి అర్నబ్‌కు ముందే ఎలా తెలిసిందన్నది కూడా సంచలనంగా మారింది. ఫిబ్రవరి 26,2019న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ జరపగా, అంతకు మూడు రోజుల ముందే ఫిబ్రవరి 23న అర్నబ్ ఈ విషయాన్ని వాట్సాప్‌ ద్వారా పార్థో దాస్ గుప్తాతో పంచుకున్నాడు. మిలటరీ అత్యంత రహస్యంగా చేపట్టే ఈ ఆపరేషన్‌ గురించి అర్నబ్‌కు ముందస్తు సమాచారం అందడమంటే... దేశ రక్షణ విషయాలు బయటకు లీకవుతున్నాయనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ రహస్యాలు ప్రత్యర్థి దేశాలకు చిక్కితే రక్షణ శాఖ చేపట్టే ఆపరేషన్స్ నిలిచిపోక తప్పదు. ఇలా రహస్యాలు బయటకు పొక్కడం వలన దేశ ప్రయోజనాలకు, జాతీయ భద్రతకు తీవ్ర భంగం, ముప్పు వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే అర్నబ్ చేసిన పనిని మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.


రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రేటింగ్ మార్చేందుకు భారీ మెత్తంలో అర్నాబ్ గోస్వామి తనకు లంచం ఇచ్చారని బ్రాడ్‌‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌ గుప్తా తెలిపారు. ముంబై పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్పీలో మార్పులు చేసేందుకు గానూ తనకు 12వేల అమెరికన్‌ డాలర్లుతోపాటు మూడేళ్లకు గానూ రూ.40 లక్షల మొత్తాన్ని అర్నాబ్ ఇచ్చారని దాస్‌‌గుప్తా చెబుతూ ఉన్నారు. 2004 నుంచే అర్నాబ్ తనకు తెలుసునని పార్థో దాస్‌ గుప్తా చెప్పుకొచ్చారు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్లమని.. 2013లో నేను బార్క్ సీఈవోగా నియమితుడినయ్యానని తెలిపారు.

2017లో అర్నాబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించారు. చానల్ మొదలెట్టకముందే పలు ప్రణాళికల గురించి నాతో అనేకసార్లు చర్చించేవాడని.. చానల్ రేటింగ్ పెంచడంలో సహాయం చేయాలని పరోక్షంగా మాట్లాడేవాడని తెలిపారు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం కూడా అర్నబ్ ‌కు తెలవడంతో.. భవిష్యత్తులో నాకు సాయం చేస్తానని మాటిచ్చాడు. దీంతో రిపబ్లిక్‌ టీవీకి నంబర్‌1 రేటింగ్‌ వచ్చేలా నా టీంతో కలిసి పనిచేశానని చెప్పుకొచ్చారు పార్థో దాస్ గుప్తా. 2017 నుంచి 2019 వరకు రిపబ్లిక్ టీవీకి నంబర్ 1 రేటింగ్ వచ్చేలా చేసినందుకు అర్నబ్‌ గోస్వామి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే 12000 డాలర్లు (8లక్షల 74 వేలు) అందుకున్నానని దాస్‌‌గుప్తా తెలిపారు. తనతో పాటూ పని చేసే మరికొంత మంది ఉద్యోగులతో కలిసి టీఆర్ఫీ రేటింగ్ ను ముందుగానే ఫిక్స్ చేసేవారిమని దాస్ గుప్తా వెల్లడించారు. అర్నబ్ గోస్వామి తనను కలిసి ఫ్యామిలీ ట్రిప్స్ కోసం డబ్బులను ఇచ్చాడని.. అది కూడా క్యాష్ రూపంలోనని చెప్పుకొచ్చాడు. 2007లో తన కుటుంబంతో కలిసి ఫ్రాన్స్, స్విజర్లాండ్ ట్రిప్ కు వెళ్లాలని అనుకున్నప్పుడు 6000 డాలర్లు ఇచ్చాడని.. 2019లో స్వీడన్, డెన్మార్క్ ట్రిప్ కు వెళ్లాలని అనుకున్నప్పుడు 6000 డాలర్లు ఇచ్చాడని.. 2017లో 20 లక్షలు, 2018, 2019లో 10 లక్షలు చెప్పున పర్సనల్ గా కలుసుకుని మరీ ఇచ్చాడని వెల్లడించారు దాస్‌‌గుప్తా.

టీఆర్పీ స్కాంకి సంబంధించి జనవరి 11న 3,600 పేజీల సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌‌ను ఇప్పటికే ముంబై పోలీసులు ఫైల్ చేశారు. ఈ కేసులో దాస్‌‌గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ వివరాలతోపాటు బార్క్ ఆడిట్ రిపోర్ట్‌‌ను కూడా పొందుపరిచారు. ఈ స్కామ్ బయట పడడంతో అర్నాబ్ అరెస్ట్ పక్కా అని అంటున్నారు. టీఆర్పీ కుంభకోణం కేసు విచారణలో భాగంగా అర్నబ్ వాట్సాప్ చాట్ వెలుగుచూసిందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అన్నారు. ఈ కేసులో ఒక రాష్ట్ర ప్రభుత్వంగా తమ పరిధిలో ఏమి చేయగలమో చేస్తామని అన్నారు. రాష్ట్ర,జాతీయ భద్రతే తమకు అన్నింటికంటే ముఖ్యమని స్పష్టం చేశారు.


Next Story