కాంగ్రెస్ పార్టీకి వరుసగా పలువురు సీనియర్ నాయకులు షాకిస్తూ వస్తున్నారు. మునిగిపోతున్న నావ కాంగ్రెస్ పార్టీ అంటూ పలువురు చెబుతూ వస్తున్నారు. దాన్ని నిజం చేస్తూ పలువురు నాయకులు ఆ పార్టీని వీడుతూ ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ కు ఆ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ షాకిచ్చారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కమిటీ నాయకత్వానికి రాజీనామా చేశారు. J&K ప్రచార కమిటీ ఛైర్మన్‌గా గులాం నబీ ఆజాద్ వైదొలిగిన కొద్ది రోజులకే, అతని సహచరుడైన ఆనంద్ శర్మ ఆదివారం హిమాచల్ ప్రదేశ్ పార్టీ స్టీరింగ్ కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాసిన లేఖలో శర్మ, పార్టీ సమావేశాలకు తనను సంప్రదించడం, ఆహ్వానించకపోవడం వల్ల తన ఆత్మగౌరవం దెబ్బతింటోందని అన్నారు. తన ఆత్మగౌరవం కాపాడుకునేందుకు ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ 26న ఈ కమిటీని ఏర్పాటు చేశారు. సభలకు సంబంధించిన కీలక సమాచారం కూడా తనకు అందడం లేదని ఆనంద్ శర్మ అసహనం వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. తన ఆత్మగౌరవంతో రాజీ పడలేనని లేఖలో ఆయన పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కోర్ గ్రూపులోని సీనియర్ నేతలు ఢిల్లీ, సిమ్లాలలో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో ఆనంద్ శర్మ పాల్గొనలేదు.