కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తూ ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. 2019 ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక స్వయంప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన తర్వాత.. అమిత్‌షా కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అధికారులు కశ్మీర్ లోయలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా భద్రతా ఏర్పాట్లు చేశాయి.
శనివారం ఉదయం ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో అమిత్‌షాకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. నేరుగా నౌగాం చేరుకున్న అమిత్‌షా.. అక్కడ సీఐడీ ఇన్‌స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ దార్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడి నుంచి జవాన్ పర్వేజ్ అహ్మద్ ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. ఆయన రెండు రోజులు శ్రీనగర్‌లో, ఒక రోజు జమ్ములో గడపనున్నారు.