దేశాన్ని కుదిపేసిన ఆ వివాదంపై స్పందించిన అమిత్ షా
Amit Shah responds to Adani-Hindenburg row. దేశాన్ని కుదిపేసిన అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు.
By Medi Samrat Published on 18 March 2023 9:29 AM GMT
Amit Shah responds to Adani-Hindenburg row
దేశాన్ని కుదిపేసిన అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదని, న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలని చెప్పారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, ఆధారాలు ఉన్న వారు ఎవరైనా వాటిని కమిటీకి సమర్పించాలని సూచించారు. అదానీ గ్రూప్‌పై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆరుగురు నిపుణులతో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే, నందన్ నీలేకని, జస్టిస్ జే పీ దేవధర్, సోమశేఖర్ సుందరేశన్, ఓం ప్రకాశ్ భట్, కేవీ కామత్ ఉన్నారు.
నిరాధార ఆరోపణలను చేయకూడదని, అవి ఎంతో కాలం నిలబడవని అన్నారు. అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ద్వారా సెబీ తెలిపిందని, ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందని అమిత్ షా వివరించారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయని, రెండు మినహా మిగతా కేసులన్నీ యూపీఏ ప్రభుత్వ హయాంలో నమోదైనవేనని తెలిపారు. దర్యాప్తు సంస్థలు కోర్టులకు అతీతం కాదని అన్నారు. అవి ఇచ్చే నోటీసులు, నమోదు చేసే ఎఫ్ఐఆర్ లు, చార్జ్ షీట్ లను కోర్టుల్లో సవాలు చేసుకోవచ్చని అమిత్ షా అన్నారు. ప్రతిపక్షాలకు తమ కన్నా మంచి లాయర్లు ఉన్నారని, దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని వాళ్లు భావిస్తే కోర్టులకు వెళ్లొచ్చని అమిత్ షా అన్నారు.