Video: పెహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళులు
ఉగ్రదాడి మృతులకు శ్రీనగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు
By Knakam Karthik
Video: పెహల్గామ్ మృతులకు అమిత్ షా నివాళులు
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఘోర ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం ఉదయం శ్రీనగర్‌లోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వైద్య-చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం, మృతుల భౌతికకాయాలను పీసీఆర్‌కు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు నేతలు పుష్పగుచ్ఛాలు ఉంచి మృతుల ఆత్మశాంతికి ప్రార్థించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
శ్రీనగర్ పీసీఆర్‌లో నివాళులు అర్పించిన వెంటనే, హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి, దాడి జరిగిన పహల్గామ్‌లోని బైసరన్ ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడటంతో 26 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటన నేపథ్యంలో కశ్మీర్ లోయ వ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణ కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏరియల్ సర్వైలెన్స్, డ్రోన్ల పర్యవేక్షణతో పాటు భారీగా భద్రతా బలగాలను మోహరించారు.