కోవిడ్ -19 కేసుల పెరుగుదల మధ్య, తమిళనాడు ప్రభుత్వం జనవరి 23, ఆదివారం రాష్ట్రంలో పూర్తి లాక్‌డౌన్ విధించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల దృష్ట్యా జనవరి 9 నుండి ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్ ప్రకటించింది. రాష్ట్రంలో అన్ని రోజులూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
తమిళనాడులో ఆదివారం లాక్‌డౌన్ సమయంలో ఏమి అనుమతించబడుతుంది
పాల దుకాణాలు, ఏటీఎం కేంద్రాలు, ఆసుపత్రులు, ఆసుపత్రికి సంబంధించిన పనులు, సరుకు రవాణా, పెట్రోల్ బంక్‌లు వంటి ఆపరేషనల్ అవసరమైన సేవలు అనుమతించబడతాయి. రెస్టారెంట్‌లు, హోటళ్లు ఉదయం 7 నుండి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ డెలివరీ సౌకర్యాలతో పాటు టేకౌట్ సేవలను అందించవచ్చు. తమిళనాడులో గురువారం 24 గంటల్లో 28,561 కొత్త కోవిడ్-19 కేసులు, 39 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో గురువారం నమోదైన కొత్త కేసుల్లో ఒక్క చెన్నై జిల్లాలోనే 7,520 కేసులు నమోదు కాగా, కోయంబత్తూరులో 3,390 కేసులు నమోదయ్యాయి.
మరోవైపు కర్ణాటక ప్రభుత్వం వారాంతపు కర్ఫ్యూను వెంటనే ఎత్తివేసింది. నిపుణులు, అధికారుల అభిప్రాయం తీసుకున్నామని, శని-ఆదివారం వారాంతపు కర్ఫ్యూను ఉపసంహరించుకుంటున్నామని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్.అశోక తెలిపారు. అయితే ర్యాలీలు, ధర్నాలు, కార్యక్రమాలకు పాత మార్గదర్శకాలే అమలులో ఉంటాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం, కర్ణాటకలో 2,93,231 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 2,86,000 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. రాబోయే కొద్ది వారాల్లో కర్ణాటకలో కేసులు పెరిగే అవకాశం ఉందని, ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని నిపుణులు చెప్పారు.