కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సైనిక విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగార్థులు నానాటికి ఆందోళనలను తీవ్ర తరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికి ఆందోళనలు తగ్గడం లేదు.
ఈక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం అయ్యారు. అగ్నిపథ్ విధివిధానాలపై మరోసారి చర్చిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో రెండోసారి ఇలా సమావేశం కావడం గమనార్హం. కాగా.. సమావేశం అనంతరం సైనిక విభాగాల అధిపతులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
నిరసనకారులు ఆందోళనలో ఇప్పటి వరకు 60 రైళ్లకు నిప్పంటించారు. బిహార్‌లో 11 ఇంజిన్‌లను తగలబెట్టారు. గత నాలుగు రోజుల అల్లర్లలో ఇప్పటి వరకు ఆందోళనకారులు సుమారు 700 వందల కోట్ల రూపాయల ఆస్తిని అగ్నికి ఆహుతి చేశారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్లలో స్టాళ్లను తగులబెట్టడంతో పాటు రైల్వేకు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ఆస్తి నష్టం కేవలం అధికారులు అంచనా వేసినవి మాత్రమే. అధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి.