ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ లో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో నవజోత్ సింగ్ సిద్ధూ విభేదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకుని రాబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సిద్ధూతో తన వైరాన్ని పరిష్కరించుకోవాలని అమరీందర్ సింగ్ భావిస్తూ ఉన్నారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలకు ముందే గొడవలకు పరిష్కారం చూపాలని పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నందున పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రేపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవనున్నారు.
నవజోత్ సింగ్ సిద్ధూ గత వారం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో సమావేశమయ్యారు. దీనికి కొన్ని రోజుల ముందు, అమరీందర్ సింగ్ పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వైరానికి పరిష్కారాన్ని సిఫారసు చేయడానికి సోనియా గాంధీ నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానల్‌తో సమావేశమయ్యారు. ఈ ప్యానల్ తో సిద్ధూ భేటీ అవ్వలేదు.
ఇప్పుడు అమరీందర్ సింగ్ మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అవ్వనుండడంతో వివాదాలకు చెక్ పడే అవకాశం ఉందని అంటున్నారు. అమరీందర్ పంజాబ్‌లో నెలకొన్న పరిస్థితులను సోనియాకు వివరించనున్నారని ఢిల్లీ నేతలు అంటున్నారు. ఇద్దరు నేతల మధ్య సయోధ్యను సోనియా కుదుర్చుతారని అంటున్నారు.