దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఉన్న అమర్ జవాన్ జ్యోతి జ్వాల కేవలం 400 మీటర్ల దూరంలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఉన్న ఎటర్నల్ ఫ్లేమ్‌తో కలిసిపోయింది. ఈ విలీనంతో పాటు శుక్రవారం న్యూఢిల్లీలో సైనిక వేడుక కూడా జరిగింది. 50 ఏళ్లుగా నిర్విరామంగా వెలుగుతున్న ఈ అమర్ జవాన్ జ్యోతికి స్థాన చలనం కలిగించారు. దీంతో దేశ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ పర్యవేక్షణలో సైనిక లాంఛనాలతో ఈ కార్యక్రమం పూర్తైంది. మొదట ఇండియా గేట్ దగ్గర అమర జవాన్లకు నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక కాగడాతో అమర జవాన్ జ్యోతిని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరకు తీసుకెళ్లి.. అక్కడి జ్వాలలో విలీనం చేశారు.
జనవరి 26, 1971న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించిన అమర్ జవాన్ జ్యోతిని 1971 ఇండో-పాక్ యుద్ధంలో మరణించిన భారత సైనికుల స్మారక చిహ్నంగా నిర్మించారు. ఈ యుద్ధం ముగింపులో భారతదేశం సాధించిన విజయం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది.మరోవైపు నేషనల్ వార్ మెమోరియల్‌ని ఫిబ్రవరి 25, 2019న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై 25,942 మంది సైనికుల పేర్లు చెక్కబడ్డాయి. మాజీ సైనికులు, ప్రతిపక్ష నేతలతో సహా పలువురు అమర్ జవాన్ జ్యోతిని శాశ్వత జ్వాలలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని విమర్శించారు.