'ప్రతి రాత్రి దేవుడు నిద్ర‌లో నన్ను అడిగేవాడు..'

By -  Medi Samrat
Published on : 7 Oct 2025 11:59 AM IST

ప్రతి రాత్రి దేవుడు నిద్ర‌లో నన్ను అడిగేవాడు..

నిన్న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్‌పై న్యాయవాది షూ విసిరారు. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీజేఐపై దాడి చేసిన న్యాయవాదిని 72 ఏళ్ల రాకేష్ కిషోర్‌గా గుర్తించారు. ఘటన అనంతరం రాకేష్‌ను ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు సీజేఐ గవాయ్ సున్నితంగా నిరాకరించడంతో నిందితుడిని విడుదల చేశారు. విష్ణుమూర్తి విగ్రహంపై సీజేఐ గవాయ్‌ చేసిన వ్యాఖ్యలతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసుల విచారణలో CJI గవాయ్ వ్యాఖ్యలతో తాను చాలా కోపంగా ఉన్నానని, అందుకే తాను అలాంటి చర్య తీసుకున్నానని రాకేష్ కిషోర్ చెప్పాడు. సీజేఐ గవాయ్‌ వ్యాఖ్యలు విన్నాక.. ప్రతి రాత్రి దేవుడు నిద్ర‌లో నన్ను అడిగేవాడు.. ఇంత అవమానం తర్వాత నీవు ఎలా విశ్రాంతి తీసుకుంటున్నావ్‌.? అని.. తాను రాజకీయ పార్టీల‌కు దూరమ‌ని.. ఈ చర్యకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని అన్నారు. నేను ఇలా చేసిన తర్వాత, నా కుటుంబం కూడా సంతోషంగా ఉండదు. నన్ను జైలుకు పంపడమే మంచిదని పేర్కొన్నాడు.

సుప్రీంకోర్టులో సీజేఐ గవాయ్‌పై షూ విసిరిన తర్వాత రాకేష్.. ‘సనాతన్‌ను అవమానిస్తే హిందూస్థాన్ సహించదు’ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దాడి తర్వాత.. సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ సెక్రటరీ మీనీష్ దూబే.. రాకేష్‌తో మాట్లాడాడు.. అప్పుడు కూడా ఈ చ‌ర్య ప‌ట్ల‌ తాను చింతించనని గ‌ట్టిగా చెప్పాడు.

దాడి చేసిన వ్యక్తి శ్రీవిష్ణుపై సీజేఐ గవాయి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా మారిషస్‌లో సీజేఐ గవాయ్ ప్రసంగంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం మారిషస్‌లో CJI గవాయ్ మాట్లాడుతూ.. భారతదేశ న్యాయ వ్యవస్థ బుల్డోజర్ల పాలనలో కాకుండా చట్ట పాలనలో నడుస్తుందని అన్నారు.

జవారి ఆలయ పునర్నిర్మాణం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ ఆలయం UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన ఖజురహో ఆలయ సముదాయంలో భాగం. ఈ అంశం భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) పరిధిలోకి వస్తుందని సీజేఐ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌ను తిరస్కరించింది. అలాగే.. దేవుణ్ణి ఏదో ఒకటి చేయమని అడగండని ధర్మాసనం వ్యాఖ్యానించ‌డం వివాదాస్ప‌ద‌మైంది.

Next Story