తప్పనిసరిగా ఆ రోజు కన్నడ జెండా ఎగురవేయండి : డీకే శివకుమార్

నవంబర్ 1 కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ దృష్ట్యా ఈసారి 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ కన్నడ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలు, వ్యాపారులు సహా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది

By Medi Samrat  Published on  11 Oct 2024 6:15 PM IST
తప్పనిసరిగా ఆ రోజు కన్నడ జెండా ఎగురవేయండి : డీకే శివకుమార్

నవంబర్ 1 కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ దృష్ట్యా ఈసారి 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అందరూ కన్నడ జెండాను ఎగురవేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలు, వ్యాపారులు సహా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 1వ తేదీన బెంగళూరులోని అన్ని విద్యాసంస్థలు, వ్యాపార భ‌వ‌నాల‌లో, కర్మాగారాల్లో తప్పనిసరిగా కన్నడ జెండాను ఎగురవేయాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.

బెంగళూరు అర్బన్ జిల్లాలో దాదాపు 50 శాతం మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారేనని.. వారు కూడా కన్నడ భాష నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. మైసూరు రాష్ట్రానికి కర్ణాటకగా నామకరణం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. నవంబర్ 1 కన్నడ ప్రజలకు పండుగ రోజు, బెంగళూరు ఇన్‌చార్జ్ మంత్రిగా నేను అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఫ్యాక్టరీలు, IT-BT సహా అన్ని ఆఫీసుల‌లో తప్పనిసరిగా కన్నడ జెండాను ఎగురవేయాల‌ని కోరుతున్నాన‌న్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విషయమై ఉత్తర్వులు జారీ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. అలాగే.. రాజ్యోత్సవ్ ప్రభుత్వ కార్యక్రమాన్ని ఒకే చోట నిర్వహిస్తామని, అయితే ప్రైవేట్, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా విధిగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అన్నారు.

ఓ ప్రశ్నకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సమాధానమిస్తూ.. ఈ కన్నడ దేశంలో నివసించే ప్రజలందరూ కన్నడ భాషను నేర్చుకోవడం తమ కర్తవ్యమని అందరికీ చెప్పాలనుకుంటున్నామని.. పాఠశాలల్లో కన్నడను తప్పనిసరి చేశామని చెప్పారు. కన్నడ తెలియకుండా కర్ణాటకలో జీవించడం సాధ్యం కాదని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమాల మాదిరిగానే నవంబర్ 1న కన్నడ జెండాను ఎగురవేయడంతో పాటు పాఠశాలలు, కళాశాలల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు.

Next Story