ఎన్సీపీకి షాకిచ్చిన అజిత్ పవార్.. మహారాష్ట్రలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్..!
Ajit Pawar’s shocker for NCP, takes oath as Maharashtra Deputy Chief Minister. మహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్సీపీలో అజిత్ పవార్ అంసతృప్తిగా ఉన్నారని
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 2 July 2023 5:37 PM ISTమహారాష్ట్రలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్సీపీలో అజిత్ పవార్ అంసతృప్తిగా ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం సాగుతూ వచ్చింది. ఆయనేమో అదేమీ లేదని చెబుతూ వచ్చారు. కానీ ఊహించని విధంగా అజిత్ పవార్ తిరుగుబాటు జెండా ఎత్తారు. తన మద్దతు ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఎన్సీపీలో చీలిక తెచ్చారు. తన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ - షిండే శివసేన కూటమి నేతృత్వంలో ఉన్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే అజిత్ పవార్ సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను అజిత్ పవార్ కలిశారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది శాసనసభ సభ్యులు ఉండగా.. అందులో 30 మంది అజిత్ పవార్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతా కలిసి రాజ్‌భవన్ వెళ్లి అక్కడ గవర్నర్ రమేశ్ బైస్‌ను కలిశారు. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, మిగితా 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తీరుపై అజిత్ పవార్ చాలా రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్సీపీ చీఫ్ గా అజిత్ పవార్ ను ప్రకటిస్తే అతడు బీజేపీ - షిండే శివసేన కూటమితో చేతులు కలిపే అవకాశం ఉందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో అజిత్ పవార్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి దూరం అయింది. రెండు రోజుల క్రితమే ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేశారు అజిత్ పవర్. అంతలోనే ముఖ్యమంత్రి షిండే వర్గం పావులు కదిపి అజిత్ పవార్‌తో సంప్రదింపులు జరిపారు. ఫలితంగానే పార్టీలో చీలిక జరిగింది. 29 మందితో పాటు వెళ్లి షిండే సర్కారుకు అజిత్ పవార్ మద్దతు పలికినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అజిత్‌కు సొంత బాబాయే కావడం గమనార్హం. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన దీర్ఘకాల మిత్రపక్షమైన బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. అప్పుడు కూడా డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వారి ప్రభుత్వం 80 గంటలు మాత్రమే కొనసాగింది. ఇక ఇప్పుడు మరోసారి డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టనున్నారు.