మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి విదిప్ దిలీప్ జాదవ్ అంత్యక్రియలు గురువారం తెల్లవారుజామున ఆయన స్వగ్రామం తారాద్‌గావ్‌లో జరిగాయి. బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో దిలీప్ జాదవ్ కూడా మరణించారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్, ఇద్దరు పైలట్లు, ఒక విమాన సహాయకురాలు ప్రాణాలు కోల్పోయారు.
విదీప్ జాదవ్ 2009 బ్యాచ్ కానిస్టేబుల్. స్పెషల్ ప్రొటెక్షన్ యూనిట్‌లో పోస్ట్ చేయబడిన విదీప్ జాదవ్, జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరు కావడానికి ముంబై నుండి బారామతికి అజిత్ పవార్‌తో కలిసి ప్రయాణిస్తున్నాడు.
ఇదిలా ఉండగా బుధవారం ఉదయం అజిత్ పవార్, ఇతరులు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం బారామతి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. అందులో ఉన్న వారందరూ అక్కడికక్కడే మరణించారు. బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విదీప్ జాదవ్ మృతదేహాన్ని తారద్‌గావ్‌కు తీసుకువచ్చారు. అర్ధరాత్రి ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.
అంత్యక్రియల సమయంలో లోనంద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది విదిప్ జాదవ్ కు గౌరవ వందనం సమర్పించారు. ఆయన చిన్న కుమారుడు చితికి నిప్పంటించగా.. అక్కడ ఉన్నవారి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
విదీప్ జాదవ్ థానే నగరంలోని విటావా ప్రాంత నివాసి. ప్రమాద వార్త అందిన వెంటనే అతని భార్య, ఇద్దరు పిల్లలు బారామతికి చేరుకున్నారు. అక్కడ మృతదేహాన్ని గుర్తించి పోస్ట్‌మార్టం పరీక్ష తర్వాత వారికి అప్పగించారు. ముంబై పోలీస్ కమిషనర్ దేవేన్ భారతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. విదీప్ జాదవ్ అకాల మరణంతో ముంబై పోలీసులు అంకితభావంతో పనిచేసే అధికారిని కోల్పోయారని అన్నారు. జాదవ్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు.