అజిత్ దోవల్-తులసీ గబ్బార్డ్‌ కీలక సమావేశం.. ఆ అంశంపైనే చ‌ర్చ‌

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ మధ్య ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది.

By Medi Samrat  Published on  17 March 2025 9:34 AM IST
అజిత్ దోవల్-తులసీ గబ్బార్డ్‌ కీలక సమావేశం.. ఆ అంశంపైనే చ‌ర్చ‌

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ మధ్య ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత్, అమెరికాల మధ్య సంబంధాలు, పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. తులసి గబ్బర్డ్ ప‌లు దేశాల ప‌ర్య‌ట‌న‌ల‌కు బ‌య‌లుదేరింది. ఈ క్రమంలోనే ఆమె భారత్‌కు చేరుకుంది. రైసినా డైలాగ్‌లో గబ్బర్డ్ కూడా పాల్గొంటారు. భారత పర్యటన తర్వాత తులసి గబ్బర్డ్ జపాన్, థాయ్‌లాండ్‌లలో పర్యటించనున్నారు.

తులసి గబ్బర్డ్ తనను తాను చైల్డ్ ఆఫ్ ది పసిఫిక్ అని పిలుచుకుంటుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలో చేరిన తర్వాత గబ్బార్డ్‌కి ఇది రెండో విదేశీ పర్యటన. దీనికి ముందు ఆమె జర్మనీకి వెళ్లి అక్కడ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

రైసినా డైలాగ్‌లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ తులసి గబ్బార్డ్‌ను ఆహ్వానించారు. మార్చి 18న ఆమె ఇందులో పాల్గొంటారు. ఈ కాన్ఫరెన్స్‌లో గబ్బర్డ్ భారత్, ఇతర దేశాల అధికారులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రైసినా డైలాగ్ అనేది భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ప్రపంచ సమస్యలను చర్చించే వేదిక.

తులసి గబ్బార్డ్ ఇండియన్ థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF) ప్రెసిడెంట్ సమీర్ సరన్‌ను కలవబోతున్నారు. ఇద్దరి మధ్య ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. రైసినా డైలాగ్ మార్చి 17 నుండి 19 వరకు నడుస్తుంది. దీనిని ORF.. విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా హోస్ట్ చేస్తాయి.

ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్ అధ్యక్షతన జరిగిన ఇంటెలిజెన్స్ చీఫ్‌ల సమావేశంలో గబ్బర్డ్‌తో పాటు కెనడాకు చెందిన టాప్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ డేనియల్ రోజర్స్, బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎంఐ-6 చీఫ్ రిచర్డ్ మూర్ కూడా పాల్గొన్నారు. ఉగ్రవాదం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో సహా వివిధ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఈ సదస్సు దృష్టి సారించింది.

Next Story