ఈ ఏడాది ఫిబ్రవరి 27న విమాన కాక్‌పిట్‌లోకి ఒక మహిళను.. పైలట్ అనుమతించడం వివాదాస్పదం అయింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం కొరడా ఝుళిపించింది. విమానయాన సంస్థకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్, 1937 ప్రకారం తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు, DGCA నిబంధనలను ఉల్లంఘించినందుకు పైలట్ లైసెన్స్ మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు.
ఢిల్లీ-దుబాయ్ ఫ్లైట్ లో ఈ సంఘటన జరిగింది. విమానంలోని కాక్‌పిట్‌లో ఒక లేడీ ఫ్రెండ్‌కి మద్యం, స్నాక్స్ అందించమని పైలట్ కోరాడు. ఈ విషయం మొదట బయటకు రాలేదు. ఆపరేటింగ్ సిబ్బందిలో ఒకరు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌కు లేఖ రాసినా.. సంస్థ సత్వర దిద్దుబాటు చర్య తీసుకోలేదని DGCA పేర్కొంది.