విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లలో ఎలాంటి సమస్య లేదు: ఎయిర్ ఇండియా

గత నెలలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత DGCA ఆదేశాలను అనుసరించి, ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్‌ల తనిఖీలను పూర్తి చేసింది.

By Knakam Karthik
Published on : 17 July 2025 7:43 AM IST

National News, Ahmedabad Plane Crash, Air India, fuel control switches

విమానాల్లో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లలో ఎలాంటి సమస్య లేదు: ఎయిర్ ఇండియా

గత నెలలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత DGCA ఆదేశాలను అనుసరించి, ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానాల ఇంధన నియంత్రణ స్విచ్‌ల తనిఖీలను పూర్తి చేసింది. బోయింగ్ 787 విమానాల్లో 'ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌'లను (ఇంధన నియంత్రణ స్విచ్‌లు) లాక్ చేసే వ్యవస్థలో ఎటువంటి లోపాలు లేవని తమ పరిశీలనలో తేలిందని ఎయిర్​ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన బోయింగ్ 787-8 విమాన ప్రమాదం నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించింది.

గత నెల ఎయిర్​ఇండియా ఏఐ-171 అనే బోయింగ్ 787-8 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయింది. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంధన సరఫరా నియంత్రించే రెండు ఫ్యూయల్ స్విచ్‌లు ఆఫ్ అయినట్లు ఆ నివేదికలో ఏఏఐబీ పేర్కొంది. ఈ నివేదిక వెలుగులోకి రావడం వల్ల డీజీసీఏ సోమవారం ఎయిర్​ఇండియా సహా అన్ని భారతీయ విమానయాన సంస్థలకు తమ బోయింగ్ 787, 737 విమానాల్లో 'ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్'ను తక్షణమే పరిశీలించాలని ఆదేశించింది. ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుందా? లేదా? అన్నది ప్రధానంగా పరిశీలించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన ఇంజినీరింగ్ బృందం ద్వారా తన సేవలో ఉన్న అన్ని బోయింగ్ 787 విమానాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టింది. 'మా బోయింగ్ 787 విమానాల్లోని ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల లాకింగ్ మెకానిజంపై పూర్తి స్థాయి ముందు జాగ్రత్త తనిఖీ పూర్తయ్యింది. ఎటువంటి లోపాలు కనిపించలేదు' అని ఎయిర్​ఇండియా తెలిపింది.

విమానం ఇంజిన్లకు ఇంధన ప్రవాహాన్ని నియంత్రించడంలో ఇంధన నియంత్రణ స్విచ్‌లు కీలకం. AAIB యొక్క 15 పేజీల ప్రాథమిక నివేదిక ప్రకారం, కూలిపోయిన బోయింగ్ 787-8 లోని రెండు ఇంధన స్విచ్‌లు ఒకదానికొకటి "రన్" నుండి "కటాఫ్" స్థానానికి ఒక సెకనులోపు మారాయి, దీని ఫలితంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లో, పైలట్‌లలో ఒకరు మరొకరిని ఎందుకు కట్ చేశాడని అడుగుతున్నట్లు వినబడింది? మరొక పైలట్ అలా చేయలేదని స్పందించాడు" అని నివేదిక పేర్కొంది.

Next Story