ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని జరిగిన హత్యాయత్నం కేసు మరోసారి వార్తల్లో నిలిచింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హపూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓవైసీ, ఆయన కాన్వాయ్‌పై ఇద్దరు నిందితులు శుభమ్, సచిన్ కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒవైసీ తృటిలో తప్పించుకున్నారు. నిందితులిద్దరిపై యూపీ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత అలహాబాద్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది.
కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన నిందితులకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఒవైసీ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 3న తనపై దాడికి యత్నించిన నిందితులకు బెయిల్ మంజూరైందని ఒవైసీ పిటిషన్‌లో పేర్కొన్నారు. బెయిల్ ఆర్డర్‌ను ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ అంశాన్ని పునర్విచారణ కోసం అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలా? వద్దా? అనే అంశంపై మాత్రమే సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. నవంబర్ 11న ఈ అంశంపై మరోసారి విచారణను సుప్రీంకోర్టు చేపట్టనుంది.