ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఓ వైపు ముస్లింల ఇండ్లపు బుల్డోజర్లు ప్రయోగిస్తూనే, మరో వైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని అన్నారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందానని, కొన్ని రోజులుగా తన ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారని ఆరోపించారు. రాళ్ల దాడితో తనకు భయం లేదని, దాని ప్రభావం దేశంపై పడదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదన్నారు. ఇది ఏమాత్రం దేశానికి మంచిది కాదన్నారు. స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ హర్యానా లోని నూహ్ జిల్లా హింస ఘటనలపై మాట్లాడతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రేపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని, దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారన్నారు. తాము హింసను ఖండిస్తున్నామని, అయితే ఓ వర్గానికి సామూహిక శిక్షను విధిస్తున్నారని అన్నారు.
ఆగస్టు 13వ తేదీ సాయంత్రం అసదుద్దీన్ ఓవైసీ అధికారిక బంగ్లాపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో అసదుద్దీన్ ఓవైసీకి ఎలాంటి గాయాలు కాలేదు. ఢిల్లీలోని తన అధికారిక ఇంటిపై కొందరు దాడి చేశారని పోలీసులకు అసదుద్దీన్ ఓవైసీ ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.