2030 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్..!
కామన్వెల్త్ గేమ్స్ 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం హక్కులు పొందింది.
By - Medi Samrat |
కామన్వెల్త్ గేమ్స్ 2030కి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం హక్కులు పొందింది. బుధవారం స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం తర్వాత అహ్మదాబాద్‌ను ఆతిథ్య నగరంగా ప్రకటించారు. 20 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతకుముందు 2010లో ఈ క్రీడలు న్యూఢిల్లీలో నిర్వహించబడ్డాయి. అప్పుడు భారత ఆటగాళ్లు 38 స్వర్ణాలు సహా 101 పతకాలు సాధించారు.
అహ్మదాబాద్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2030 నిర్వహణకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించడం గమనార్హం. ఇక్కడ ఆటగాళ్లు, అధికారులు, ప్రేక్షకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాన వేదికలుగా నరేంద్ర మోదీ స్టేడియం, నారన్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్, సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌లను ప్రతిపాదించారు.
కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడం అనేది ఏ దేశానికైనా ఒక క్రీడా కార్యక్రమం మాత్రమే కాకుండా.. దాని అంతర్జాతీయ ఇమేజ్, అభివృద్ధి సామర్థ్యం, మౌలిక సదుపాయాలకు చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, కెనడా, న్యూజిలాండ్ సహా మొత్తం 9 దేశాలు కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చాయి. భారత్ రెండోసారి ఆతిథ్య హక్కులను పొందింది.
2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా భారత్ సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ఈ విషయాన్ని ప్రకటించారు. గతేడాది నవంబర్‌లో భారత్ ఒలింపిక్ గేమ్స్-2036కి ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్‌ను దాఖలు చేసింది.
కామన్వెల్త్ క్రీడల చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. దీనిలో బ్రిటీష్ పాలిత దేశాల నుండి ఆటగాళ్ళు పాల్గొంటారు. ప్రస్తుతం ఇందులో 54 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ ఆటలు 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో ప్రారంభమయ్యాయి. ఇంతకుముందు దీనిని బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పిలిచేవారు. 1978 నుండి దాని పేరు 'కామన్వెల్త్ గేమ్స్'గా మారింది.