కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పై తీవ్ర నిరసనలు

Agnipath Scheme Defence Job Seekers Protest In Bihar.రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 Jun 2022 10:32 AM GMT
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ పై తీవ్ర నిరసనలు

రక్షణ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై నిరసనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. భారత సైన్యం, ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందుతూ, సిద్ధమవుతున్న వ్యక్తులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని మంగళవారం ప్రకటించింది. త్రివిధ దళాల అధిపతుల సమక్షంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వయసుగల వారిని అగ్నివీరులుగా ఎంపిక చేస్తారు. వీరిని నాలుగేళ్ళ తర్వాత విడుదల చేస్తారు. ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఈ నాలుగేళ్ళ కాలంలో నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు వేతనం చెల్లిస్తారు. జీవిత బీమా వంటి సదుపాయాలను కూడా కల్పిస్తారు. అగ్నివీరులుగా చేరేందుకు మహిళలను కూడా అర్హులుగా ప్రకటించారు. సైన్యం, నావికా దళం, వాయు సేనలలో దాదాపు 45,000 మందిని నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రిక్రూట్‌మెంట్లు 90 రోజుల్లో ప్రారంభమవుతాయని, మొదటి బ్యాచ్ 2023 జూలైనాటికి సిద్ధమవుతుందని తెలిపింది.

స్వల్ప కాలంపాటు కాంట్రాక్టు ప్రాతిపదికపై సైనికులను నియమించుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని యువత తప్పుబడుతోంది. సైన్యంలో చేరడం కోసం రెండేళ్ళ నుంచి శ్రమించి, చదువుకుంటున్న వారు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నూతన పథకం వల్ల తమ దీర్ఘకాలిక అవకాశాలు దెబ్బతింటాయని.. అగ్నివీరులుగా నియమితులైనవారిలో కేవలం 25 శాతం మంది మాత్రమే తిరిగి రెగ్యులర్ కేడర్‌లో చేరే అవకాశం ఉందని ప్రభుత్వం చెప్పడం కరెక్ట్ కాదని అంటున్నారు. వయో పరిమితిని సడలించాలి డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ కారణంగా నియామక ప్రక్రియను రెండేళ్ళపాటు వాయిదా వేసినందువల్ల వయోపరిమితిని రెండేళ్ళు సడలించాలని కోరారు. అగ్నిపథ్ స్కీమును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story