ముంబై విమానాశ్రయంలో ఈరోజు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉదయం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లే ఎయిరిండియా విమానానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు రావడంతో ఎయిరిండియా విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా దించారు.
ముంబై నుంచి మస్కట్ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6ఈ 1275, ముంబై నుంచి జెడ్డా వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6ఈ 56లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు ఇండిగో విమానాల్లో 258 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విచారణ తర్వాత విమానాలను మళ్లీ గమ్యస్థానానికి పంపారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ప్రకారం, మొత్తం మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఇండిగో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రెండు విమానాలకు బాంబు బెదిరింపు వచ్చిన వెంటనే.. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం వాటిని వెంటనే విమానాశ్రయం నుండి ప్రత్యేక ప్రాంతానికి తరలించారు. అనంతరం విమానాన్ని పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, ఇతర సంబంధిత ఏజెన్సీలు ఈ ప్రక్రియలో పాల్గొన్నాయి. ప్రయాణికుల భద్రతే తమ ప్రాధాన్యత అని.. ప్రయాణికులకు ఎలాంటి హాని కలగకుండా ప్రతి అడుగు వేస్తున్నట్లు ఇండిగో తెలిపింది.
బాంబు బెదిరింపు రావడంతో ఎయిరిండియా విమానంపై కూడా విచారణ చేపట్టారు. విమానాన్ని వేరే రన్‌వే వైపు మళ్లించారు. కొన్ని గంటలపాటు విమానాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎయిర్ ఇండియా విమానం AI 657లో 135 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు.