రాజస్థాన్‌లోని రణథంబోర్ నేషనల్ పార్క్‌లో 25 పులులు తప్పిపోయాయని ఒక నివేదిక బయటకు వచ్చింది. అయితే వాటిలో 10 ఇప్పటికే గుర్తించారు. జైపూర్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న వన్యప్రాణుల రిజర్వ్‌లోని 75 పులులలో 25 గత ఏడాది కనిపించకుండా పోయాయని రాజస్థాన్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ పవన్ కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు.
ఒక సంవత్సరంలో ఇంత ఎక్కువ సంఖ్యలో పులులు కనిపించకుండా పోవడం, అధికారికంగా నివేదించడం ఇదే మొదటిసారి. అంతకుముందు, 2019- 2022 మధ్య రణథంబోర్ నుండి 13 పులులు తప్పిపోయినట్లు నివేదించారు. 2022 లెక్కల ప్రకారం.. ఇందులో పులుల సంఖ్య 88గా అంచనా వేయబడింది. తప్పిపోయాయని నివేదిక అందిన 24 గంటల్లోనే పది పులులను గుర్తించామని నేషనల్ పార్క్ అధికారి ఒకరు తెలిపారు.
మానిటరింగ్ రికార్డులను సమీక్షించడానికి, పార్క్ అధికారుల లోపాలను గుర్తించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. తప్పిపోయిన 25 పులులలో నాలుగు 17 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నాయి. పులులు సాధారణంగా 14-15 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించవు. ఈ తప్పిపోయిన పులులలో కొన్ని చనిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.