ఆ కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు, పెళ్లయిన నెల రోజులకే విడిపోయాం..కోర్టులో నటి రన్యారావు భర్త
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరీ కోర్టును ఆశ్రయించారు.
By Knakam Karthik Published on 17 March 2025 4:25 PM IST
ఆ కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు, పెళ్లయిన నెల రోజులకే విడిపోయాం..కోర్టులో నటి రన్యారావు భర్త
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావు భర్త జతిన్ హుక్కేరీ కోర్టును ఆశ్రయించారు. రన్యారావుతో ఉన్న సంబంధం కారణంగా పోలీసులు తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో కోర్టును ఆశ్రయించాడు. అరెస్టు నుంచి మినహాయింపు కలిగించేలా ఆదేశించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జతిన్ హుక్కేరీ తరపు న్యాయవాది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రన్యారావుతో జతిన్‌కు నవంబర్‌లో పెళ్లి అయిందని..కానీ నెల రోజులకే తనతో విడిపోయినట్లు కోర్టు ఎదుట వెల్లడించాడు. కొన్ని సమస్యల కారణంగా అనధికారికంగా విడిపోయారని కోర్టుకు తెలిపాడు.
వాదనల సందర్భంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) తరపు న్యాయవాది మాట్లాడుతూ.. వచ్చే సోమవారం తమ అభ్యంతరాన్ని దాఖలు చేస్తామని చెప్పారు. అయితే జతిన్ హుక్కేరీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కర్ణాటక హైకోర్టు మార్చి 11న పోలీసులను ఆదేశించింది. మార్చి 24 సోమవారం జరిగే తదుపరి విచారణ వరకు డీఆర్ఐ తన అభ్యంతరాలన్ని దాఖలు చేసే వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని హైకోర్టు గత విచారణ సందర్భంగా వెల్లడించింది.
కాగా నటి రన్యా రావును మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారంతో అరెస్టు చేశారు . ఆ తర్వాత ఆమె నివాసంపై జరిపిన దాడిలో రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమెను అరెస్టు చేసి కస్టడీలో ఉంచారు, ఆమె బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది.