గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యారావుకు, తరుణ్ రాజ్‌కు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దుబాయ్ నుంచి అక్రమంగా 14 కేజీలకు పైగా బంగారాన్ని తరలిస్తుండగా మార్చి 3న అధికారులు రన్యా రావును ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సెషన్స్ కోర్టులో బెయిల్ కు అప్లై చేయగా కోర్టు నిరాకరించింది. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు వారిద్దరూ ఒక్కొక్కరికి రూ. 2 లక్షల వ్యక్తిగత బాండ్‌తో పాటు ఇద్దరు పూచీకత్తులను సమర్పించడం ద్వారా డిఫాల్ట్ బెయిల్‌కు అర్హులని పేర్కొంది.
విచారణ జరిగే అన్ని తేదీల్లోనూ తప్పకుండా హాజరు కావాలని, సాక్ష్యాలను తారుమారు చేయకూడదని, దర్యాప్తుకు సహకరించాలని సూచించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకూడదని కోర్టు ఆదేశించింది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు అవుతుందని కోర్టు స్పష్టం చేసింది.