అన్నాడీఎంకే కి విజయ్ కాంత్ ఝలక్!
Actor Vijayakanth's DMDK Quits AIADMK-BJP Alliance. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పొత్తుల రచ్చ కొనసాగుతూ ఉంది. ఒకవైపు
By Medi Samrat Published on 10 March 2021 7:32 AM GMT
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పొత్తుల రచ్చ కొనసాగుతూ ఉంది. ఒకవైపు డీఎంకే పొత్తులు ఖరారు అయ్యాయి. అన్నాడీఎంకే పొత్తులు మాత్రం చర్చలుగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్పట్లో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన పార్టీల వాటాల లెక్కలు మాత్రం తేలుతున్నట్టుగా లేవు. ఈ క్రమంలో 40 సీట్లు కావాలంటూ పట్టుబట్టిన తమిళ నటుడు విజయ్ కాంత్ పార్టీకి సంబంధించి లెక్కలు తేలడం లేదట. దీంతో తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేతో బంధానికి సినీ నటుడు విజయకాంత్ పార్టీ డీఎండీకే టాటా చెప్పింది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు.
తాజాగా కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో ఆ పార్టీ నేతలు చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కూటమి నుంచి వైదొలగుతున్నట్లు విజయకాంత్ ప్రకటించారు. ఆ కూటమి నుంచి వైదొలగటం వల్ల తమ పార్టీకి దీపావళి పండుగ వచ్చినట్టుందని ఆ పార్టీ నేతలు అన్నారు. ఈ క్రమంలో విజయ్ కు రెండో ఆప్షన్ గా కమల్ హాసన్ కూటమి ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కమల్ పార్టీతో శరత్ కుమార్ జట్టుకట్టాడు.
అన్నాడీఎంకే కూటమి నుంచి శరత్ కుమార్ వైదొలిగాడు. ఇక ఇప్పుడు అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వస్తే విజయ్ కాంత్ కూడా కమల్ కూటమితో చేతులు కలుపుతారని వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకేతో డీఎండీకే పలు సార్లు చర్చలు కొనసాగించింది. అయినప్పటికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో డీఎండీకే అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి తమిళ సినిమాల్లో విభిన్నమైన ఇమేజ్ లతో సత్తా చూపిన వీరు ముగ్గురూ కూటమిగా ఎన్నికలకు వెళితే అది పొలిటికల్ మల్టీస్టారరే అవుతుంది. రాజకీయాల్లో సోలోగా తామేం చేయలేమని దక్షిణాది స్టార్ హీరోలకు క్లారిటీ వచ్చింది.