సినీ విమర్శకుడు, నటుడు కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని ఓషివారా ప్రాంతంలో జనవరి 18న జరిగిన కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు తానే బాధ్యుడినని విచారణలో కేఆర్కే అంగీకరించారు.
ఈ నెల 18న ఓషివారాలోని నలందా అపార్ట్‌మెంట్‌పైకి కొన్ని బుల్లెట్లు దూసుకొచ్చాయి. అపార్ట్‌మెంట్‌లోని రెండో అంతస్తులో నివసించే రచయిత నీరజ్ కుమార్ మిశ్రా, నాలుగో అంతస్తులో ఉండే మోడల్ ప్రతీక్ బైద్ ఫ్లాట్లలో ఈ బుల్లెట్లను గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేఆర్కేను ప్రధాన అనుమానితుడిగా గుర్తించారు. తన లైసెన్స్‌డ్ గన్‌ను శుభ్రం చేసిన తర్వాత దాని పనితీరును పరీక్షించేందుకు కాల్పులు జరిపానని విచారణలో కేఆర్కే చెప్పినట్లు సమాచారం. తన ఇంటికి ఎదురుగా ఉన్న మడ అడవుల వైపు గాల్లోకి కాల్చానని, అయితే గాలి కారణంగా బుల్లెట్లు పక్కకు వెళ్లి భవనాన్ని తాకి ఉండొచ్చని వివరించారు. ఉద్దేశపూర్వకంగా భవనంపైకి కాల్పులు జరపలేదని పేర్కొన్నారు. కేఆర్కే నుంచి లైసెన్స్‌డ్ తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.