బెంగుళూరు నగరాన్ని కుదిపేసిన ₹7.1 కోట్ల భారీ దోపిడి కేసులో కీలక మలుపు నమోదైంది. చోరీ చేసిన అనంతరం హైదరాబాద్‌కు పారిపోయిన ముగ్గురు నిందితులను బెంగుళూరు పోలీసులు సిసిఎస్ హైదరాబాద్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. సమాచారం మేరకు బెంగుళూరు దొంగతనం కేసులో ముందే పట్టుబడ్డ ప్రధాన నిందితులు ఇచ్చిన వివరాలను బట్టి, ఈ ముగ్గురు సహనిందితులు బెంగుళూరు నుండి కారులో హైదరాబాద్‌కి తరలివచ్చినట్లు తెలిసింది. నగరానికి చేరుకున్న వారు నాంపల్లి ప్రాంతంలోని ఒక లాడ్జ్‌లో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు.
వెంటనే బెంగుళూరు స్పెషల్ టీమ్ హైదరాబాద్ చేరుకుని, సిసిఎస్ పోలీసులతో కలిసి నిందితుల కోసం గాలించారు. ఇదే సమయంలో ముగ్గురు నిందితులు లాడ్జ్ నుండి రైల్వే స్టేషన్‌కి చేరుకుని, తమతో తెచ్చుకున్న ₹58 లక్షల నగదుతో ముంబైకి పారిపోయే ప్రణాళిక రచించినట్లు బయటపడింది. కానీ పోలీసులు అప్పటికే సమాచారాన్ని పొందడంతో, నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ పై వారిని పట్టుకున్నారు. నిందితులు వెంట తెచ్చుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అనంతరం ముగ్గురిని బెంగుళూరు తరలించినట్లు అధికారులు తెలిపారు. దోపిడి కేసు దర్యాప్తులో ఇది కీలక పురోగతిగా పేర్కొంటున్నారు.