తమిళనాడు మాజీ మంత్రి, అన్నాడీఎంకే ముఖ్యనేత కేసీ వీరమణి ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగానికి కేసీ వీరమణి మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కేసీ వీరమణి ఇల్లు, ఆఫీస్, బంధువుల ఇళ్లు సహా మొత్తం 35 ప్రాంతాలలో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా అక్రమ సంపాదన పట్టుబడింది.
ఈ దాడులలో కోట్లలో విలువైన ఆస్తి పత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా ఈ సోదాలలో రోల్స్ రాయల్స్ సహా 9 విలాసంతమైన కార్లు, 5 కేజీల బంగారు ఆభరణాలు, 47 గ్రాముల డైమండ్స్, 7.2 కేజీల వెండి, రూ. 34 లక్షల నగదు, రూ. 1.8 లక్షల విదేశీ కరెన్సీని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయమై తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.