'నేను రూ. 500తో రాజ్యసభకు వ‌స్తాను.. ఇదో జోక్' : అభిషేక్ మను సింఘ్వీ

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటుపై నోట్ల క‌ట్ట‌ కనిపించడంతో పార్లమెంట్‌లో దుమారం రేగింది.

By Medi Samrat  Published on  6 Dec 2024 7:53 AM GMT
నేను రూ. 500తో రాజ్యసభకు వ‌స్తాను.. ఇదో జోక్ : అభిషేక్ మను సింఘ్వీ

రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటుపై నోట్ల క‌ట్ట‌ కనిపించడంతో పార్లమెంట్‌లో దుమారం రేగింది. కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ సీటుపై భద్రతా అధికారులు నగదు నిల్వను కనుగొన్నారని చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ సభకు తెలిపారు. ఇప్పుడు ఈ విషయంలో సింఘ్వీ స్పందించారు.

ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మాట్లాడుతూ.. నిన్న వాయిదా అనంతరం సభను సాధారణ తనిఖీ చేస్తున్న సమయంలో సీటు నంబర్ 222 కింద నోట్ల కట్ట బయటపడిందని తెలిపారు. ప్రస్తుతం ఈ సీటును తెలంగాణ నుంచి ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురాగా.. విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చానని పేర్కొన్నారు.

రాజ్యసభ ఛైర్మన్ ప్రకటనపై స్పందిస్తూ.. కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి ఇది విని "షాక్" అయ్యానని అన్నారు. నేను రాజ్యసభకు వెళ్లినప్పుడల్లా రూ.500 నోటు తీసుకుని వెళ్తాను. సెక్యూరిటీ ఏజెన్సీల్లో ఏదైనా లోపం ఉంటే దాన్ని కూడా పూర్తిగా బహిర్గతం చేయాలి. నేను నిన్న మధ్యాహ్నం 12.57 గంటలకు సభ లోపలికి చేరుకున్నాను. మధ్యాహ్నం ఒంటి గంటకు లేచాను. మధ్యాహ్నం 1 నుంచి 1:30 వరకు అయోధ్య ప్రసాద్‌తో కలిసి క్యాంటీన్‌లో కూర్చుని భోజనం చేశాను. నేను మధ్యాహ్నం 1:30 గంటలకు పార్లమెంటు నుండి బయలుదేరాను. కాబట్టి నిన్న నేను హౌస్‌లో మొత్తం 3 నిమిషాలు.. క్యాంటీన్‌లో నా బస 30 నిమిషాలు, ఇది 3 నిమిషాల్లో ఎలా జరిగిందని ప్ర‌శ్నించారు. ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయాలు చేయడం నాకు వింతగా అనిపిస్తోందని సింఘ్వీ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేకుండా విచారణ జరగాలన్నారు. ఎవరైనా వచ్చి సీటుపై ఉంచారో కూడా దర్యాప్తు చేయాలి. ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం విచారకరం, హాస్యాస్పదంగా ఉందన్నారు.

Next Story