అవినీతి ఆరోపణలు.. పంజాబ్ మంత్రి రాజీనామా
AAP’s Fauja Singh Sarari resigns from Punjab Cabinet. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు ఫౌజా సింగ్ సరారీ పంజాబ్ క్యాబినెట్‌లోని మంత్రి పదవికి శనివారం
By అంజి Published on 7 Jan 2023 5:35 PM ISTఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు ఫౌజా సింగ్ సరారీ పంజాబ్ క్యాబినెట్‌లోని మంత్రి పదవికి శనివారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలను చూపుతూ ఫౌజా సింగ్ సరారీ తన రాజీనామాను సమర్పించారు. తాను పార్టీకి నమ్మకమైన సైనికుడినని, అలాగే ఉంటానని ఆయన అన్నారు. సీఎం భగవంత్ మాన్ కేబినెట్‌లో ఉద్యానవన శాఖ మంత్రిగా సరారీ ఉన్నారు. కొన్ని నెలల క్రితం అవినీతి ఒప్పందానికి సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. అందులో అతను "డబ్బు దోపిడీకి ఒప్పందం కుదుర్చుకున్నట్లు" వినిపించింది.
దీంతో సరారీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సరారీని వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ప్రతి పక్షాలు డిమాండ్ చేశాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను సరారీ కొట్టి పారేశారు. కాగా ప్రతిపక్షాల ఆరోపణల వల్లే సరారీ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలిసిన వివరాల ప్రకారం.. సరారీ స్థానంలో ఆప్ ఎమ్మెల్యే డాక్టర్ బల్బీర్ సింగ్ వచ్చే అవకాశం ఉంది.
ఫౌజా సింగ్ సరారీపై ఆరోపణలు
ఫౌజా సింగ్ సరారీ, అతని సన్నిహితుడు టార్సెమ్ లాల్ కపూర్ మధ్య జరిగిన సంభాషణ యొక్క ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇందులో వీరిద్దరూ డబ్బు దోపిడీ చేసే ప్లాన్ గురించి చర్చిస్తున్నట్లు ఆడియో ఉంది.
శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) నాయకుడు సుఖ్‌బీర్ బాదల్ మాట్లాడుతూ.. సరారీ రాజీనామా పంజాబీలను సంతృప్తిపరచదని, అతన్ని శిక్షించాలని అన్నారు. మరోవైపు, ఉద్యానవన శాఖ మంత్రి ఫౌజా సింగ్ సరారీ రాజీనామా చేయడంతో ఆప్ తన అసలు రంగు బయటపడకుండా కాపాడుకుందని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ రాజా అమరీందర్ వారింగ్ అన్నారు. రాజీనామాలకే వదిలేయవద్దని, అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని అన్నారు.