యమునా నది ఉప్పొంగడానికి బీజేపీనే కారణమంటున్న ఆప్
AAP smells conspiracy behind overflowing Yamuna, BJP retorts. ఢిల్లీ వరదలకు హర్యానా ప్రభుత్వమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
By Medi Samrat
ఢిల్లీ వరదలకు హర్యానా ప్రభుత్వమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ సర్కారుకు అప్రతిష్ట తీసుకుని వచ్చేందుకు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజీ నుంచి యమునా నదికి నీటిని వదులుతోందని ఆమ్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు లేనప్పుడు యమునా నదిలో నీటి మట్టం తగ్గకుండా పెరిగాయంటే అందుకు కారణమేమిటో మీరే అర్థం చేసుకోవాలంటూ ఓ వీడియోను అప్లోడ్ చేశారు. వరదలు వస్తే హత్నీకుండ్ నుంచి ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ వైపునకు సమతూకంలో నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. మూడు రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసేందుకు మూడు కెనాల్స్ ఉన్నాయి. అయితే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం మిగతా రెండు కాలువలను మూసేసి యమునా నదిలోకి నీటిని భారీగా వదులుతోందని సంజయ్ సింగ్ ఆరోపించారు.
హత్నీ కుండ్ బ్యారేజ్ నీటిని ఢిల్లీ వైపు మళ్లించడం వెనుక కుట్ర ఉందని అర్ధమవుతుందని.. ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ వైపు వెళ్లే కెనాల్ పూర్తిగా ఎండిపోయి ఉండగా, నీటిని అటువైపు మళ్లించకుండా ఢిల్లీ వైపు విడుదల చేయడం ఏమిటంటూ ఓ వీడియోను ఆప్ పోస్టు చేసింది. ఢిల్లీ ప్రజలపై బీజేపీ విద్వేషం కనబరుస్తోందని ఆప్ విమర్శలు గుప్పించింది.
బ్యారేజ్ నుంచి నీళ్లు వదలడం తప్ప వేరే అవకాశం లేదని.. ఎక్కువ నీళ్లు అలాగే ఉంచితే బ్యారేజ్ ధ్వంసమయ్యే ప్రమాదముందని అందుకే వదలాల్సి వచ్చిందని బీజేపీ మంత్రులు వివరించారు. ఎక్కువ మొత్తంలో నీరు నిల్వ ఉంచడానికి ఇది రిజర్వాయర్ కాదని.. పరిమితి మించిన తరవాతే గేట్లు ఎత్తివేసినట్టు చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ నేతలు ఆప్ ను విమర్శించారు. హత్నికుండ్...డ్యామ్ కాదని.. ఇదో బ్యారేజ్ అని వివరించారు. ఆప్ చెప్పినట్టు చేస్తే హరియాణా, పంజాబ్‌లో భారీ స్థాయిలో ప్రాణనష్టం వాటిల్లి ఉండేదని అన్నారు.