ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు ప్రవేశపెట్టిన తీర్మాణంపై ధంఖర్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ రాఘవ్ చద్దా ఇప్పటివరకు అనుభవించిన సస్పెన్షన్‌ను తగిన శిక్షగా పరిగణించాలని ఎంపీ జీవీఎల్ నరసింహరావు ప్రవేశపెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు. నేటి నుంచి రాఘవ్ చద్దా సస్పెన్షన్‌ను నిలిపివేయడాన్ని సభ పరిశీలించవచ్చని ధంఖర్‌ను కోరారు.
115 రోజుల తర్వాత ఆయన మళ్లీ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డాను ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీన రాజ్యసభ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసింది. తమ అనుమతి లేకుండా తమను ఢిల్లీ బిల్లు ప్రతిపాదిత కమిటీలో చేర్చారంటూ నలుగురు రాజ్యసభ ఎంపీలు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక హక్కుల ఉల్లంఘన కింద ఆయనపై చర్యలు తీసుకున్నారు. అనంతరం దీనిపై సభా హక్కుల కమిటీ దర్యాప్తు చేపట్టింది.