ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలోనే చంపావత్ జిల్లా వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. తనక్‌పూర్‌లో సమీపంలోని పూర్ణగిరి రోడ్లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ బస్సులో డ్రైవర్, మరో వ్యక్తి తప్ప మరెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వారిద్ధరిని సురక్షితంగా బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. వరద ఉధృతిని గమనించినప్పటికీ, డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడం వల్లే ప్రమాదం జరిగిందని, బస్సు అదుపు తప్పి కాల్వలో పడిందని పోలీసులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ను వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అంతేకాకుండా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో..డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి.