మసీదు లోపల మత గ్రంథానికి నిప్పు.. భారీగా మోహరించిన పోలీసులు
A religious book was set on fire inside a mosque in Shahjahanpur. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మసీదులో ముస్లిం మతానికి చెందిన మత గ్రంథాన్ని తగులబెట్టిన ఉదంతం
By అంజి Published on 3 Nov 2022 6:21 PM IST
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో మసీదులో ముస్లిం మతానికి చెందిన మత గ్రంథాన్ని తగులబెట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. విషయం తెలియగానే ముస్లిం సంఘాల ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనకు దిగారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి స్వల్పంగా బలవంతంగా జనాన్ని చెదరగొట్టారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చిందని పోలీసు సూపరింటెండెంట్ ఎస్ ఆనంద్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మసీదులో ఖురాన్ కాపీని తగులబెట్టిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
నిందితుడిని తాజ్ మహ్మద్‌గా గుర్తించామని, అతడు ఎందుకు నేరం చేశాడో ఇంకా తెలియరాలేదని చెప్పారు. బుధవారం సాయంత్రం నగరంలోని కొత్వాలి ప్రాంతంలో ఉన్న ఫఖ్రే ఆలం మసీదులో పవిత్ర గ్రంథంలోని కొంత భాగాన్ని కాల్చివేసినట్లు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ రమిత్ శర్మ తెలిపారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, ఎలాంటి జాప్యం లేకుండా దర్యాప్తు చేపట్టామని పోలీసు సూపరింటెండెంట్ ఎస్ ఆనంద్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో నిందితుడిని గుర్తించామని, అనంతరం బారుజై ప్రాంతంలో అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. జిల్లా మేజిస్ట్రేట్ ఉమేష్ ప్రతాప్ సింగ్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (ఫైనాన్స్ అండ్ రెవిన్యూ) రామ్‌సేవక్ ద్వివేది సంఘటనా స్థలాన్ని పరిశీలించి, శాంతి భద్రతలను కాపాడాలని, పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మసీదు దగ్గర పోలీసు సిబ్బందిని మోహరించారు. షాజహాన్‌పూర్ మసీదు ఇమామ్ కూడా శాంతి భద్రతలు కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షాజహాన్‌పూర్ ఎస్పీ ఎస్ ఆనంద్ మాట్లాడుతూ.. ''కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని మతపరమైన స్థలంలో మతపరమైన పుస్తకానికి సంబంధించిన కొన్ని పేజీలు కాలిపోయినట్లు మాకు సమాచారం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలతో మాట్లాడి కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నాం. ఘటనా స్థలంలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీటీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. దాని ఆధారంగా గుర్తింపు జరుగుతోంది.'' అని చెప్పారు.