బీహార్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌.. బండారం బయటపడిందిలా

A fake police station busted in Bihar. ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌స్టేషన్‌నే ఏర్పాటు చేశాడు. ఏకంగా 8 నెలల పాటు పోలీస్‌స్టేషన్‌ను నడిపి.. స్థానికంగా వసూళ్లకు పాల్పడ్డారు.

By అంజి  Published on  19 Aug 2022 9:53 AM IST
బీహార్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌.. బండారం బయటపడిందిలా

మీరు మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' సినిమా చూసే ఉంటారు. అందులో హీరో డాక్టర్‌ కాకపోయినా ఓ నకిలీ ఆస్పత్రి పెడుతాడు. అచ్చం ఆస్పత్రిలాగే సెటప్‌ కూడా చేస్తారు. తాజాగా బీహార్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అయితే అది ఆస్పత్రి కాదు.. పోలీస్‌ స్టేషన్‌. ఓ వ్యక్తి ఏకంగా పోలీస్‌స్టేషన్‌నే ఏర్పాటు చేశాడు. ఏకంగా 8 నెలల పాటు పోలీస్‌స్టేషన్‌ను నడిపి.. స్థానికంగా వసూళ్లకు పాల్పడ్డారు. తాజాగా ఈ ముఠా గుట్టును నిజమైన పోలీసులు రట్టు చేశారు.

బాంకా సిటీలో ఈ నకిలీ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు. పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. వారికి నకిలీ పోలీస్‌ డ్రెస్‌లు ఇచ్చి పనిలో పెట్టుకున్నాడు. వారు కూడా తాము నిజంగానే పోలీసులు ఉద్యోగాలు చేస్తున్నామనుకున్నారు. వారిని వాడుకుని ప్రధాన నిందితుడు.. పలువురిని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డాడు. ఇలా 8 నెలల పాటు సాగిన వీరి వ్యవహారం.. తాజాగా బయటపడింది. ప్రధాన నిందితుడు భోలా యాదవ్‌.. రూ.వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించకున్నాడు.

మరో ముగ్గురిని తన గ్యాంగ్‌లో కలుపుకొని వారికి డీఎస్పీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ లాంటి హోదాలు కట్టబెట్టాడు. పైగా స్థానిక పోలీస్‌ అధికారి ఇంటికి 500 మీటర్ల దూరంలోనే దీన్ని నడపడం గమనార్హం. బుధవారం సాయంత్రం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్‌ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశాడు. వెంటనే పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వీరి బండారం బయటపడింది. పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

Next Story