''మా అమ్మ నా చాక్లెట్లు దొంగిలిస్తోంది. దయచేసి ఆమెను జైల్లో పెట్టండి'' అని ఓ బుడ్డోడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తమాషాగా అనిపించినా నిజం. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లా దేధతలై గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల బాలుడు సద్దాం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన తల్లిపై ఫిర్యాదు చేశాడు. తన తల్లి తనకు స్నానం చేయించిన తర్వాత కాటుక పెడుతుందని, అది తనకు ఏ మాత్రం ఇష్టం లేదని బుడ్డోడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాటుక పెడుతున్నప్పుడు బుడ్డోడు అల్లరి చేయడంతో.. తల్లి అతని చెంపపై సున్నితంగా తట్టింది.
దీంతో బాలుడు సద్దాం ఆగ్రహించాడు. కోపం కట్టలు తెచ్చుకుంది. తల్లిపై ఫిర్యాదు చేసేందుకు తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాలని తండ్రిని పట్టుబట్టాడు. పోలీస్‌స్టేషన్ వెళ్దాం వస్తావా? రావా? అంటూ ఒకటే మంకు పట్టు పట్టాడు. చివరకు బాలుడి తండ్రి అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బాలుడు తన సమస్యలను ఎస్‌ఐ ప్రియాంక నాయక్‌కు వివరించి ఫిర్యాదు తీసుకోవాలని పట్టుబట్టాడు. ఆమె నవ్వుతూ కూర్చీలో కూర్చొని బాలుడి నుంచి ఫిర్యాదు తీసుకుని సంతకం కూడా తీసుకుంది. దీంతో సద్దాం ఆగ్రహం చల్లారి ఎస్‌ఐకి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపాడు.