మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడు ఆడుతూ కుప్పకూలి గుండెపోటుతో మరణించాడు. బాధితుడు శ్రావణ్ అజిత్ గవాడే గురువారం సాయంత్రం ఇతర పిల్లలతో కలిసి గణపతి మండలంలో ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. శ్రావణ్ ఇంటికి పరిగెత్తి తన తల్లి ఒడిలో పడుకున్నాడు, అక్కడే చివరి శ్వాస తీసుకున్నాడు. బాలుడి ఊహించని మరణం గ్రామం, పరిసర ప్రాంతాలలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
"శ్రావణ్ సరదాగా, స్నేహపూర్వకంగా ఉండేవాడు" అని అతని మామ గజానన్ గవాడే అన్నారు. మృతుడి తండ్రి అజిత్ గవాడేకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, శ్రావణ్, ఒక కుమార్తె ఉన్నారు. వారి కుమార్తె నాలుగు సంవత్సరాల క్రితం మరణించింది. ఇప్పుడు వారి కొడుకు మరణంతో, కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. కళ్ల ముందే ఉన్నట్టుండి కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.