ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. తొమ్మిది మంది నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది నక్సలైట్లు మరణించారు.

By అంజి  Published on  3 Sep 2024 9:30 AM GMT
Naxals killed, encounter, security forces, Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. తొమ్మిది మంది నక్సలైట్లు హతం

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మంగళవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది నక్సలైట్లు మరణించారు. దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో నక్సలైట్ల ఉనికిపై నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. సెర్చ్ ఆపరేషన్ సమయంలో, ఉదయం 10.30 గంటలకు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA) కంపెనీ నంబర్ 2 నుండి భద్రతా సిబ్బంది - నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ 303, 12 బోర్ గన్‌లతో సహా అనేక ఆయుధాలతో పాటు వారి మృతదేహాలను సంఘటన స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు.

ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు భద్రతా సిబ్బంది ఎవరూ గాయపడలేదు. గత వారం, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 'పోలీస్ ఇన్‌ఫార్మర్లు' అనే అనుమానంతో వేర్వేరు సంఘటనలలో ముగ్గురు గ్రామస్తులను నక్సలైట్లు చంపారు . కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించారు. అక్కడ ఏడు రాష్ట్రాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లతో నక్సల్ వ్యతిరేక వ్యూహాలపై చర్చించారు.

Next Story